జమ్మూకాశ్మీర్‌లో మరోసారి తీవ్రవాదులు దాడులకి తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలోని సొపూర్‌లో వున్న మెయిన్ మార్కెట్‌లో శనివారం ఉదయం తీవ్రవాదులు అమర్చిన బాంబు పేలిన ఘటనలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇధ్దరు తీవ్రంగా గాయపడ్డారు. జనంతో రద్దీగా వుండే చోటా బజార్, బడా బజార్ మధ్య ఈ బాంబును అమర్చారు తీవ్రవాదులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




సరిగ్గా తీవ్రవాదులు అమర్చిన బాంబుపైనుంచే పోలీసుల పెట్రోలింగ్ వాహనం వెళ్లడంతో ఈ పేలుడు జరిగింది. పేలుడు తీవ్రతతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. వెంటనే ఘటనాస్థలిని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి. దాడికి గురైన వారిని ఇండియన్ రిజర్వ్ పోలీసు బలగాలకి చెందిన మూడవ బెటాలియన్ పోలీసులుగా గుర్తించారు. 


జరిగిన దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి విచారం వ్యక్తంచేశారు. దాడిలో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకి తాను ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపారామె.