నైరుతి రుతు పవనాలు మంగళవారం కేరళలోకి ప్రవేశించాయి. అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా రావాల్సిన సమయం కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటవ తేదీన నైరుతి రుతపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుతుపవనాల ఆగమనానికి సూచికగా గత రెండురోజుల నుంచే కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున రెండురోజుల్లో కేరళ మొత్తం రుతుపవనాలు విస్తరించే అవకాశముంది. మరో వారం రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.  నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన అనంతరం దక్షిణ అరేబియా సముద్రం, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.




మరో నెలన్నర రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. కాగా వాతావరణాన్ని అంచనా వేసే స్కైమెట్ అనే ప్రైవేటు సంస్థ నైరుతి రుతుపవనాలు సోమవారమే ప్రవేశించినట్లు పేర్కొన్నది. మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లామ్, అలప్పుజా, కొట్టాయం, కోచి, త్రిసుర్, కోజికోడ్, తలసేరి, కన్నూరు, కుడులు, మంగలూర్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా 2.5మిమిల వర్షపాతం నమోదు అయ్యింది. అటు కర్ణాటక తీర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది.