నకిలీ మద్యం సేవించిన ఘటనలో 30కి చేరిన మృతుల సంఖ్య !
నకిలీ మద్యం సేవించిన ఘటనలో 30కి చేరిన మృతుల సంఖ్య !
లక్నో: నకిలీ మద్యం సేవించి 30 మంది మృతిచెందిన వేర్వేరు ఘటనలు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్ పూర్, ఖుషీనగర్ జిల్లాలో 16 మంది మృతిచెందగా ఈ ఘటనకు సంబంధించి 9 మంది ఎక్సైజ్ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇక ఉత్తరాఖండ్ లోని రూర్కి జిల్లాలో 14 మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోనూ 13 మంది ఎక్సైజ్ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తూ అక్కడి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మొదట 12 మంది మృతిచెందగా ఆ తర్వాత మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య మొత్తం 14కి చేరిందని హరిద్వార్ ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బాధితులకు సత్వరమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు.
స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ఖుషీనగర్ ఘటనలో గ్రామంలో జాతర జరిగిన సందర్భంలో నకిలీ మద్యం సేవించడం వల్లే బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.