డీఎంకే అధినేత కరుణానిధి మరణించడంతో ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యింది. అయితే సంప్రదాయబద్ధంగా వస్తున్న నిబంధనలను బట్టి ఆ పదవి కోసం కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే కోశాధికారి పదవికి డీఎంకే సీనియర్ నాయకులు ఎస్‌.దురై మురుగన్‌ కూడా నామినేషన్ వేశారు. అయితే వీరు ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉండడంతో.. ఈ నామినేషన్ ప్రక్రియ అనేది కేవలం పేరుకు మాత్రమే అని పలువురు డీఎంకే నేతలు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే డీఎంకే జనరల్ కౌన్సిల్‌ సమావేశంలో ఏదైనా విచిత్రం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదనేది కొందరి ఆలోచన. స్టాలిన్ తదితరులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి స్వీకరించారు. పార్టీ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయిన 60 రోజుల్లోపే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అయితే ఇటీవలి కాలంలో కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి పలు ఆరోపణలు చేయడంతో  పార్టీ శ్రేణుల్లో కాస్త గందరగోళం చెలరేగింది. 


ఇటీవలే కరుణానిధి తనయుడు ఎంకే అళగిరి సెప్టెంబర్ 5న తాను ప్రజల మద్దతు కూడగడుతూ భారీ స్థాయిలో ర్యాలీని నిర్వహిస్తానని.. డీఎంకేలో వర్గ రాజకీయాలకు తెరదించుతానని తెలిపారు. తనకు ఏ పదవి మీదా ఆశ లేదని.. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు స్టాలినే తొందరపడుతున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో తనదైన శైలిలో ఆధిపత్యం కోసం స్టాలిన్‌తో అళగరి తలపడాలని చూసినప్పుడు ఆయనను కరుణానిధి పార్టీ నుండి సస్పెండ్ చేశారు.