బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల వల్లే దేశం వెనుకబడిపోయిందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. కానీ సామాజిక అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందని ఆయన అన్నారు. మానవ అభివృద్ధి సూచీలో 188 దేశాల జాబితాలో భారత్ 131వ స్థానంలో ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆ ప్రాంతాలు మెరుగ్గా రాణిస్తున్నాయని కాంత్ తెలిపారు. భారత్ మానవ అభివృద్ధి సూచీలో మెరుగ్గా రాణిస్తే, సామాజిక అంశాల మీద దృష్టి సారించవచ్చని అభిప్రాయపడ్డారు. 'ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్ ప్రోగ్రాం' ద్వారా ఈ విషయాలపై కృషి చేస్తున్నామని చెప్పారు.


స్థిరమైన పెరుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన నీతి అయోగ్ సీఈవో, విద్య మరియు ఆరోగ్యం చాలా ముఖ్యమైనవని ఈ రెండు విషయాల్లో భారతదేశం వెనుకబడి ఉందని అన్నారు. మన విద్యావ్యవస్థ ఎలా ఉందంటే.. 5వ తరగతి విద్యార్థికి 2వ తరగతి తీసివేత ఇచ్చినా చేయలేకపోతున్నాడని అన్నారు. 5వ తరగతి విద్యార్థులు కనీసం మాతృభాషలో కూడా చదవలేకపోతున్నారని, శిశు మరణాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని..ఇలాంటి అంశాల్లో మనం మేరుగుపరుచుకుంటే స్థిరమైన పెరుగుదల సాధించడం పెద్ద కష్టమేమి కాదని అన్నారు. డెసిషన్ మేకింగ్‌లో మహిళలు పాల్గొనమని కాంత్ కోరారు.