Attack on Nisith Pramanik Convoy: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి నిశిత్ ప్రమానిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కూచ్‌బెహార్ జిల్లా దిన్హత వద్ద తన కాన్వాయ్ పై రాళ్లదాడి చేశారని.. ఇది కచ్చితంగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల మద్దతుదారుల పనే అని కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్ ఆరోపించారు. మంత్రి నిశిత్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వడంతో కారు ముందు భాగంలో ఉండే ఫ్రంట్ విండ్ షీల్డ్ పగుళ్లుబారింది. రాళ్లు రువ్వడంతో పాటు తన రాకను వ్యతిరేకిస్తూ నల్ల జండాలు చూపించారని నిశిత్ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి దాడికి పాల్పడుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్ పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారని.. అంతేకాకుండా దాడులకు పాల్పడిన వారినే పోలీసులు కాపాడి భద్రత కల్పిస్తున్నారని మంత్రి నిశిత్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వారి మద్దతుదారులు ఇవాళ ఏం చేశారనేది రాష్ట్రం మొత్తం చూస్తోందని.. నిందితులకు అధికార పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని అన్నారు. 


కేంద్ర సహాయ మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి ఘటనను పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపి ఎమ్మెల్యే నందిగమ్ సువేంద్రు అధికారి తీవ్రంగా ఖండించారు. ట్విటర్ ద్వారా ఈ ఘటనపై స్పందించిన సువేంద్రు అధికారి.. " కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి తన సొంత లోక్ సభ నియోజకవర్గంలోనే రక్షణ కరువైతే ఎలా " అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మమతా బెనర్జి ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని సువేంద్రు అధికారి మండిపడ్డారు. రాష్ట్రంలో పంచాయతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకంటే ముందే టీఎంసీ గూండాలు విచ్చలవిడిగా తిరుగుతూ అరాచకాలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఇదిలావుంటే ఈ ఘటనపై బీజేపి నేతలు చేస్తోన్న ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. టీఎంసీ నేత జైప్రకాశ్ మజుందార్ స్పందిస్తూ.. బీజేపి నేతలు దిలీప్ ఘోష్, సువేంద్రు అధికారి లాంటి నేతలే బీజేపి నేతలను రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని మండిపడ్డారు. 


పశ్చిమ బెంగాల్ బీజేపి అధికార ప్రతినిధి శ్రామిక్ భట్టాచార్య ఈ ఘటనపై మాట్లాడుతూ.. " ఒక కేంద్ర మంత్రి కారుపైనే ఇలా రాళ్లదాడికి పాల్పడి భయంకర వాతావరణం సృష్టిస్తే.. రాష్ట్రంలో ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది " అని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాష్ట్రంలో ఆర్టికల్ 355 ని అమలు చేయాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు.