స్వలింగ సంపర్కంపై సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. మంగళవారం ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియకు విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. హోమో సెక్సువల్స్ ప్రభావం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హోమో సెక్సువల్స్ చూసి ఆనందించడం కానీ.. వారికి మద్దతు పలకడం కానీ నీచమైన చర్యన్న స్వామి ..అలాంటి వారికి శిక్షించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
కేసును విస్తృత ధర్మాసనం విచారణ జరపాలి
స్వలింగ సంపర్కులను క్రిమినల్స్ గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వామి ఈ మేరకు స్పందించారు. ఇలాంటి ప్రత్యేకమైన కేసులను సాధారణ ధర్మాసనం కాకుండా ఏడుగురు లేదా తొమ్మిది మందితో కూడిన విస్తృత ధర్మాసనం ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలను వింటే బాగుంటుందని స్వామి అభిప్రాయపడ్డారు.