రాహుల్ బ్రాహ్మణ అమ్మాయిని వివాహమాడాలని టీడీపీ నేత సలహా
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి విషయానికి సంబంధించి తాను సోనియా గాంధీకి సలహా ఇచ్చానని తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అలాంటి సలహా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి విషయానికి సంబంధించి తాను సోనియా గాంధీకి సలహా ఇచ్చానని తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అలాంటి సలహా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. "యూపీలో రాహుల్‌కి బ్రాహ్మణుల మద్దతు అవసరమైతే.. తనకు కచ్చితంగా బ్రాహ్మణుల యువతినిచ్చి పెళ్లి చేయాలని నేను కోరాను.
ఎందుకంటే ఇప్పటికీ యూపీలో బ్రాహ్మణుల జనాభాయే ఎక్కువ. కానీ నా మాటలను ఆమె లక్ష్య పెట్టలేదు" అని జేసీ తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో జులై 4వ తేదిన అంతర్జాలంలో బాగానే వైరల్ అయ్యింది. ఇటీవలే రాయ్ బరేలీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఆదితి సింగ్ రాహుల్‌కి ప్రపోజ్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఆమె ఆ మాటలను కొట్టి పారేశారు. రాహుల్ తన సోదరుడు లాంటివాడని ఆమె వివరణ ఇచ్చారు.
గతంలో కూడా రాహుల్ వివాహంపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆయన ఓ విదేశీ అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఖండించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీకి 48 సంవత్సరాలు. మరో రెండు సంవత్సరాల్లో ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన పెళ్లి వార్తల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.