జమ్మూలో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత; నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులోకి నిన్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలిసిందే.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులోకి శనివారం జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కోసం అర్ధరాత్రి నుంచి వేట కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.
భారత సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఉగ్రదాడి నేపథ్యంలో సైన్యం జమ్మూలో హైఅలర్ట్‌ను ప్రకటించింది. ఆర్మీ క్వార్టర్స్ నుంచి కుటుంబసభ్యులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్మీ క్యాంపుకు సమీపంలోని పాఠశాలలను మూసివేశారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం ఉదయం జమ్మూకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఉగ్రదాడి నేపథ్యంలో పంజాబ్-జమ్మూ కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేశారని, ప్రజల భద్రత దృష్ట్యా ఉదయం నుంచి వాహనాలను తనిఖీ చేస్తున్నారని పంజాబ్ పోలీస్ అధికారి సుతిష్ చౌదరి చెప్పారు. అలానే అనుమాస్పద వ్యక్తులపై గట్టి నిఘా పెట్టమని అన్నారు.