ఎస్సీ/ఎస్టీ చట్టం రివ్యూ పిటిషన్‌ను అంగీకరించిన సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ఓపెన్ కోర్టు విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కీలక నిబంధనలు మార్చడంపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ చట్టంలోని ఏ నిబంధనలను సడలించినా ఈ తీర్పు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదని కేంద్రం పేర్కొంది.
హింసాత్మకంగా మారిన బంద్
ఎస్సీ, ఎస్టీ యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు సోమవారం చేపట్టిన 'భారత్ బంద్' కొన్నిచోట్ల హింసాత్మకంగా మారింది. పోలీసులు...ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం బలహీనపడి దళితులపై దాడులు పెరిగే అవకాశముందని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేస్, రాజస్తాన్, పంజాబ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాస్తారోకోలు, రోడ్లపై బైఠాయింపులు, షాపులను ధ్వంసం చేయడం, రైలు రోకోలు, వాహనాలను తగులబెట్టడం వంటి ఘటనలు జరిగాయి. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా ఏడుగురు చనిపోగా, యుపీలో ఇద్దరు, రాజస్తాన్ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.