దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న రఫేల్ డీల్ వివాదంలో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రఫేల్ జెట్స్ కొనుగోలు ధర, ఇతర వివరాలతో కూడిన పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో 10 రోజుల్లోగా కోర్టుకు అందించాల్సిందిగా సుప్రీం కోర్టు బుధవారం కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు అందుబాటులో ఉండదగిన ప్రతీ వివరాన్ని కేంద్రంలో ఈ నివేదికలో పొందుపర్చాల్సిందిగా కోర్టు కేంద్రానికి జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. న్యాయవాదులు మనోహర్ లాల్ శర్మ, వినీత్ దండా దాఖలు చేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలో యు యు లలిత్, కేఎం జోసెఫ్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.