ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ముకుత్ బిహారీ వర్మ శనివారం చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన "రామమందిరాన్ని మేం పూనుకుంటే నిర్మించడం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు మాకు చెందిందే.. ప్రస్తుతం ఈ సమస్య సుప్రీంకోర్టులో ఉంది" అన్నారు. ఆ తర్వాత దేశంతో పాటు జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్ కూడా తమవేనని.. సంకల్ప బలం ఉంటే తాము మందిరాన్ని నిర్మించి తీరుతామని ఆయన అనడంతో విస్తుపోవడం అక్కడ ఉన్నవారి వంతైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. అయితే తన మాటలను సమర్థించుకోవాలని భావించి మళ్లీ స్టేట్ మెంట్ ఇచ్చిన వర్మ మరల అదే మాట అన్నారు. "నేను తప్పు మాట ఏమన్నాను. ఈ దేశం మాది అయినప్పుడు.. సుప్రీంకోర్టుతో పాటు అన్నీ మావే కదా" అనడంతో మళ్లీ ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. అయితే వర్మ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఎంతగా బరితెగించి మాట్లాడుతున్నారో చూడండని పోస్టులు పెట్టారు. 


73 సంవత్సరాల ముకుత్ బిహారీ వర్మ యూపీలోని కైసర్ గంజ్ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వర్మ మాటలకు బీజేపీ నేతలు కూడా స్పందించారు. బీజేపీ నేత అనిలా సింగ్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు స్వతంత్ర సంస్థ. అది ఒకరి ప్రేరణతో పనిచేస్తుందని ఎవరూ అనకూడదు. సుప్రీంకోర్టు ఏ సంస్థకి, పార్టీకి చెందింది కాదు" అని ఆమె వివరణ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నేత సంజయ్ ఝా కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ నేత ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజానీకానికి ప్రమాదకరమైన సంకేతాలు పంపించే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు.