బోగస్‌, నకిలీ ఓట్లను అరికట్టేందుకు ఆధార్ ఆధారిత ఓటింగ్ సిస్టంను అమలుచేయాలంటూ చేసిన అభ్యర్థనను విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ పిటిషన్‌ను మార్చి నెలలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం పరిశీలించనుందని ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయవాది, భాజపా నాయకుడు అశ్విన్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ ఈ పిటిషన్‌ను వేశారు. ఆధార్‌ ఓటింగ్‌ సిస్టంను అమలయ్యేలా ఎన్నికల సంఘానికి మరదర్శకాలు  ఇవ్వాలని ఆయన తెలిపారు.  


ఆధార్ ఆధారిత ఓటింగ్ సిస్టం ద్వారా ఎక్కువమంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని, నకిలీ, బోగస్ ఓట్లను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని పిటిషన్‌లో తెలిపారు. నకిలీ ఓట్లు వేయడం, బూత్‌ క్యాప్చరింగ్‌ వంటివి దేశంలో ఎక్కువగా జరుతున్నాయని, ఇప్పుడున్న ఓటింగ్ వ్యవస్థ వీటిని అదుపు చేయలేదని ఆయన వివరించారు. ఆధార్‌ ఓటింగ్‌ వల్ల ఓటర్ల సమాచారం భద్రంగా ఉండటంతో పాటు, దేశం నలుమూలల నుంచి ఎక్కడి నుంచైనా ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు.