ఇకపై మన దేశంలో స్వలింగ సంప‌ర్కాన్ని నేర‌ంగా పరిగణించవచ్చా లేదా అనే అంశాన్ని నిగ్గుతేలుస్తూ ఎప్పటి నుంచో న్యాయస్థానంలో నానుతున్న వివాదాస్పద ఐపీసీ 377 సెక్షన్‌పై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు లోబడి ఐపీసీలోని 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంప‌ర్కం నేరంగా పరిగణిస్తుండగా ఆ సెక్షన్ ని స‌వాల్ చేస్తూ గత కొన్ని ఏళ్ల కాలంలో సుప్రీం కోర్టులో ఎన్నో పిటిషన్లు దాఖ‌లయ్యాయి. స్వలింగ సంపర్కానికి పాల్పడిన వారికి 1861 నాటి బ్రిటీష్ చట్టాల ప్రకారం 10 ఏళ్లపాటు జైలు శిక్షను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కాన్ని ప్రకృతి విరుద్దంగా చూడటాన్ని పిటిషనర్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నో దేశాల్లో స్వలింగ సంపర్కం చట్టరీత్యా నేరం కాదనే అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఐపీసీ 377 సెక్షన్‌పై చారిత్రక తీర్పు వెల్లడించనుంది.


స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 377కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ప్రముఖ భరత నాట్యం డ్యాన్సర్ నవ్‌తేజ్ సింగ్ జోహర్, ప్రముఖ జర్నలిస్ట్ సునిల్ మెహ్రా, హోటల్ వ్యాపరంలో పేరున్న రితు దాల్మియ, నీమ్రానా హోటల్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు అమన్ నాథ్, మహిళా వ్యాపారవేత్త ఆయేషా కపూర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.