ఇక మొబైల్ యాప్ ద్వారా పాస్పోర్టుకి దరఖాస్తు చేసుకోండి..!
మంగళవారం ఉదయం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ `పాస్ పోర్టు` సేవా యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు
మంగళవారం ఉదయం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ "పాస్ పోర్టు" సేవా యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా పాస్ పోర్టు సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఈ యాప్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతం నుండైనా, ఎవరైనా పాస్ పోర్టుకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాక.. పోలీస్ వెరిఫికేషన్ దరఖాస్తుదారుడు అందించిన చిరునామా వద్ద జరుగుతుంది.
ఆ తర్వాత రిజిస్టర్డు పోస్టు ద్వారా పాస్ పోర్టు అందుతుంది. ఈ కొత్త స్కీమ్ ద్వారా పాస్ పోర్టు అప్లికేషను కూడా మొబైల్ ఫోన్ ద్వారా నింపవచ్చు. ఈ కొత్త పథకంతో పాటు పాస్ పోర్టు నిబంధనలలో కూడా పలు మార్పులు చేసింది ప్రభుత్వం. తాజా ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తుదారులు తమ మ్యారేజ్ సర్టిఫికెట్లు దరఖాస్తుతో పాటు అటాచ్ చేయాల్సిన అవసరం లేదు.
అలాగే విడాకులు తీసుకున్న మహిళలు కూడా తమ మొదటి భర్త పేరును పాస్ పోర్టు దరఖాస్తులో నింపాల్సిన అవసరం లేదు. విదేశాంగ శాఖ పాస్ పోర్టు సేవల నిమిత్తం అందించిన తాజా ఉత్తర్వులు "పాస్ పోర్టు సేవా దివస్"ను పురస్కరించుకొని పాస్ పోర్టు సేవా కేంద్రాలకు అందాయి.