ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లా?:రజినీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఐపీఎల్ మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఐపీఎల్ మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని తమిళ ప్రజలు పోరాడుతున్న సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని సూపర్‌స్టార్ రజినీకాంత్ అన్నారు. ప్రజల ఇబ్బందులను, మనోభావాలను, బాధలను అర్థం చేసుకోవాలని కోరారు.
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఆయన మొదటిసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించాలని కోరారు. కావేరి బోర్డును కేంద్రం తక్షణం ఏర్పాటు చేయకపోతే తమిళ ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని అన్నారు. ఈ సమస్యను వెంటనే ప్రధాని మోదీ పరిష్కరించాలని.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరారు.
కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని తమిళ నటీనటుల సంఘం నిరసన
కావేరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కోసం తమిళనాట ఉద్యమం ఉధృతమైంది. పార్టీ ఆందోళనకు సినిమావాళ్లు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. కేంద్రం కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళ నటీనటుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ నేతృత్వంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సినీనటులు విశాల్, సూర్య, కార్తీ, విజయ్, సత్యరాజ్, శివకార్తికేయన్, ఆర్కే సెల్వమణి, ధాను తదితరులు పాల్గొన్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై తమిళ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అటు రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నాయకుడు టీటీవీ దినకరన్, క్రికెట్ అభిమానులు ఈ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసి తమిళ రైతులకు అండగా నిలవాలని, కావేరి బోర్డు కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.