Sanitary Napkins Vending Machines: కాలేజీల్లో శానిటరి న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్స్, ఇన్‌సినిరేటర్స్
Sanitary Napkins Vending Machines: ప్రభుత్వ కళాశాలల్లో బాలికల హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం అని సంబంధిత అధికారులు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు సేకరించి ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.
Sanitary Napkins Vending Machines: ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థినుల హాజరు శాతం పడిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కళాశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్స్, ఇన్‌సినిరేటర్స్ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ జరిపిన ఒక పరిశోధనలో నెలసరి వల్ల కలిగే తీవ్ర అసౌకర్యం, అనారోగ్యం, నొప్పి కారణంగానే బాలికలు ఆ సమయంలో కాలేజీలకు రాలేకపోతున్నారని.. ఫలితంగా వారి హాజరు శాతం కూడా తగ్గిపోతోంది అని తేలింది.
మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ కళాశాలల్లో బాలికల హాజరు శాతంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ అంశంపై స్పందించిన తమిళనాడు సర్కారు.. బాలికల హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని నడుం బిగించింది. అందులో భాగంగానే శానిటరి న్యాప్ కిన్ వెండింగ్ మెషిన్స్ ప్రాజెక్ట్ తెరపైకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ కళాశాలల్లో బాలికల హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం అని సంబంధిత అధికారులు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు సేకరించి ఈ ప్రాజెక్టును నిర్వహించే విధంగా తమిళనాడు సర్కారు ప్లాన్ చేస్తోంది.
కాలేజీలో విద్యార్థినుల సంఖ్య, టీచింగ్, నాన్ - టీచింగ్ స్టాఫ్‌లో మహిళల సంఖ్య ఆధారంగా శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్స్, ఇన్‌సినిరేటర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆయా కాలేజీల్లో పని చేసే కింది స్థాయి సిబ్బందికి ఈ శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్స్, ఇన్‌సినిరేటర్స్ నిర్వహించే బాధ్యతలు అప్పగించనున్నారు. 2023- 24 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ పని పూర్తి చేయనున్నట్టు తమిళనాడు సర్కారు స్పష్టంచేసింది.