రెచ్చిపోయిన పోలీసులు: ఇవాళ ఒక్కరైనా చావాలి..
మంగళవారం తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో ఆందోళనకారులపై పోలీసులు జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందారు.
తమిళనాడు: మంగళవారం తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో ఆందోళనకారులపై పోలీసులు జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపింది. ఈ ఘటన పట్ల సీఎం పళనిస్వామి జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఇంకా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులే ఉన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు జిల్లా అంతటా 144సెక్షన్ విధించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
మంగళవారం స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలో భారీ స్థాయిలో హింస చెలరేగింది. ఆ సమయంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తమిళనాడు పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఆ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఓ వార్తా సంస్థ విడుదల చేసింది. సివిల్ డ్రెస్‌లో ఓ వాహనంపైన ఉన్న పోలీసు.. తన దగ్గర ఉన్న సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్)తో నిరసనకారులపై కాల్పులకు పాల్పడ్డాడు. 'ఆందోళనకారులను టార్గెట్ చేయండి. ఇవాళ ఒక్కరైనా చావాలి' అని పోలీసు తన సహచరులకు చెప్తున్న దృశ్యాలు ఆ వీడియోలో సంచలనంగా మారాయి. దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తూత్తుకుడిలో పోలీసులు చంపడమే టార్గెట్‌గా తుపాకీ ఎక్కుపెట్టారని పలువురు మండిపడ్డారు.
హింసలో గాయపడ్డ వారిని పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండిఎంకె) అధినేత వైగో పరామర్శించారు. మక్కల్ నీదిమయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్, ఎంకే నేత స్టాలిన్ తూత్తుకుడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ అంశంపై బుధవారం మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) స్టెరిలైట్ ఇండస్ట్రీస్ అక్కడ నిర్మించాలనుకుంటున్న కాపర్ స్మెల్టర్ నిర్మాణంపై స్టే ఆర్డర్ ఇచ్చింది.