భారత ప్రధాని నరేంద్ర మోదీ పై తెలుగుదేశం పార్టీ నేత... ఏపీ మంత్రి యనమల రామక్రిష్ణుడు విమర్శలు కురిపించారు.. మోదీని ఆయన అనకొండతో పోల్చారు. సీబీఐ, ఆర్‌బీఐ లాంటి సంస్థలను మింగేయాలని ఆయన చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆయనను ఇప్పటికీ కొందరు రక్షకుడిగా ఎలా భావిస్తున్నారో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. అయితే యనమల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని అవినీతికి రారాజుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి చంద్రబాబు చేస్తున్న అవినీతే కారణమని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మాటలపై మళ్లీ యనమల స్పందించారు. దేశాన్ని బీజేపీ నుండి రక్షించడానికి టీడీపీ నడుం బిగించిందని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలన్నా.. రాజ్యాంగ విలువలను పరిరక్షించాలన్నా.. అందరూ ఐకమత్యంగా ముందుకు వచ్చి బీజేపీకి ఓటు వేయడం మానేయాలని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు కేవలం అధికారం కోసమే చూస్తున్నాయని.. ఆ పార్టీలకు దేశం ఏమైపోయినా ఫర్వాలేదని ఆరోపించారు. 


బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ "దేశంలోని అవినీతి పరులైన రాజకీయ నాయకులంతా కలిసి ఒక కూటమి పెట్టుకుంటున్నారు. చంద్రబాబు కూడా అందులో చేరారు. కానీ వారంతా కలిసి దేశాన్ని దోచుకోవాలంటే మాత్రం.. ఆ పని ఎప్పటికీ జరగదు. చంద్రబాబు తన అవినీతి చరిత్ర ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడుతూనే బతుకుతున్నారు. అందుకే అవినీతి పరులకు అడ్డుకట్ట వేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపారు" అని తెలిపారు.