తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు థర్డ్ ఫ్రంట్‌పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతు.. భారత రైతాంగం దేశ రాజకీయాలపై తీవ్రమైన అసహనంతో వున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మాత్రమే మారుతున్నాయే కానీ ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా పథకాలు రూపుదిద్దుకోవడం లేదని కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం అవసరమైతే దేశం కోసం పనిచేయడానికైనా తాను సిద్ధమేనని ప్రకటించారు. అవసరమైతే, దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంటో లేక మరో ఫ్రంటో.. ఏదో ఒకటి వస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 


ఇదే విషయంపై మరిన్ని వివరాలు వెల్లడించే క్రమంలో.. తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమే అయినప్పుడు.. తాము దేశం కోసం ఎందుకు పనిచేయకూడదు అని ఎదురు ప్రశ్నించారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా ఇప్పటికే ఈ విషయంలో సీపీఎం నేత సీతారాం ఏచూరితో మాట్లడానని తెలిపారు.