అరబ్ పెళ్లిళ్లకు టి.సర్కార్ చెక్
పెళ్లిళ్ల పేరిట అభం శుభం ఎగురని బాలికలను వంచిస్తున్న అరబ్ షేకుల మోసాలకు అడ్డుకడ్డ వేసే దిశగా టి.సర్కార్ అడుగులు వేస్తోంది. విదేశీయులతో పెళ్లిళ్లకు కఠిన నిబంధనలు విధించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 1980లో తీసుకొచ్చిన మైనార్టీ సంక్షేమశాఖ చట్టంలో సవరణలు చేయాలని టి సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఇది అడ్వొకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. అడ్వొకేట జనరల్ అభిప్రాయం తీసుకున్న అనంతరం ఈ చట్టానికి తుది రూపం రానుంది. తాజాగా రూపొందించిన నిబంధనలను ఒక్కసారి పరిశీలిద్దాం..
* ముస్లింల పెళ్లిళ్లకు ప్రధానంగా విదేశీయులతో పెళ్లే చేసే సందర్భంలో వధువు వయస్సు ధ్రువీకరణ పత్రం అవసరం.
* ఆధార్ కార్డును వయసు ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తారు.
* పదేళ్ల వయస్సు వ్యత్యాసం ఉంటే మ్యారేజ్ రిజిస్త్రేషన్ కు అనుమతి ఇవ్వరాదని నిర్ణయం.
* పదేళ్లకు మించి వ్యత్యాసం ఉంటే.. ఇరు కుటుంబాలు, పెళ్లి చేసుకునే యువతి అభిప్రాయాన్ని మరోసారి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంది.
* పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదంటూ (ఎన్‌వోసీ) ధ్రువీకరించిన పత్రాన్ని ఆయా దేశాల్లోని సంబంధిత అధికారుల నుంచి వరుడు తీసుకోవాలి.
* పెళ్లికి సుమారు నెల రోజుల ముందుగా అమ్మాయి కుటుంబం నివసించే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి
* నెల రోజుల్లో పోలీసులు వాటిని పరిశీలించి, అవి అధికారికంగా జారీ అయినవేనని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
అరబ్ దేశాల నుంచి వచ్చే వృద్ధులు ఇక్కడి దళారులను ఆశ్రయించి అమాయక పేద ముస్లింల కుటుంబాల్లోని చిన్నారులను పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. డబ్బులకు ఆశపడి తల్లిదండ్రులు అమాయక బాలికలను బలి చేస్తున్నారు. పెళ్లి కోసం విదేశాల నుంచి వచ్చే మోసగాళ్లకు ముక్కుతాడు వేయడంతో పాటు బాల్యవివాహాలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు అడుగులు వేస్తోంది.