జాతీయ పరిశోధన సంస్థ -ఎన్‌ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ పీపుల్ జాబితాలో తెలంగాణకు చెందిన మావోయిస్టు నాయకుడు గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావుకు కూడా చోటు దక్కింది. కరీంనగర్ జిల్లా సారంగపూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు పీపుల్స్ వార్ గ్రూపుతో తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సాయుధ మిలట్రీ వ్యూహాకర్తగా కూడా రాణించారు. నక్సల్స్ ఉద్యమాన్ని ప్రభావితం చేశారు. గతంలో ఆయన బీహార్ రాష్ట్రంలోని గయ ప్రాంతంలో కొన్నాళ్లు ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనేకసార్లు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా, మరో  మావోయిస్టు నాయకుడు కేశవరావు అలియాస్ బసవరాజ్ పై ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. తాజాగా ఎన్‌ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ పీపుల్ జాబితాలో కేవలం లక్ష్మణరావుపైనే అత్యధిక పారితోషికం ఉండడం గమనార్హం.


తాజాగా ఎన్‌ఐఏ విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ పీపుల్ జాబితాలో లష్కరే తయీబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ అగ్రనేత సలాహుద్దీన్‌, ముంబై దాడుల సూత్రధారి జకీర్‌ రెహ్మాన్‌ లఖ్వి, అమెరికన్‌ జైల్లో ఉన్న డేవిడ్‌ హెడ్లీ, జునైద్‌  అక్రమ్‌ మాలిక్‌, సాజిద్‌ మజిద్‌ మొదలైన వారు కూడా ఉన్నారు. అలాగే ఈ జాబితాలో పేర్కొన్న వారిలో ఇప్పటికే 98 మందిపై రెడ్ కార్నర్ నోటీసు ఉంది. వీరిని పట్టుకోవడానికి సామాన్య ప్రజలు కూడా సహకరించాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.