అమర్‌నాథ్ యాత్రాస్థలం వద్ద హైఎలర్ట్
అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులను జాగరూపులై ఉండమని ప్రభుత్వం చెబుతోంది
అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులను జాగరూపులై ఉండమని ప్రభుత్వం చెబుతోంది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఇప్పటికే 20 మంది మిలిటెంట్లు యాత్ర జరుగుతున్న చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిసిందని.. సెక్యూరిటీ దళాలు హై ఎలర్ట్ ప్రకటించారని కూడా వార్తలు వస్తున్నాయి.
గత సంవత్సరం అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన 10 మంది యాత్రికులను లష్కర్ ఈ తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు మిలిటెంట్లు హతమార్చారు. ఈ సంవత్సరం అలాంటి విపరీత చర్యలు జరగకుండా సరిహద్దు వద్ద భద్రతా దళాలను భారీగా మోహరించారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రతీ సంవత్సరం ఏదో ఒక విపత్తును అధిగమించి జరుగుతున్న ఉత్సవమే. ముఖ్యంగా తీవ్రవాదుల దాడులు ఆయా ఉత్సవం జరుగుతున్న ప్రాంతాల్లో కాస్త ఎక్కువే. 2001లో అమర్‌నాథ్ గుహకు కొద్ది దూరంలోనే 13 మంది యాత్రికులు మిలిటెంట్ల తూటాలకు బలయ్యారు.
ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్ అమర్ నాథ్ ఉత్సవం జరుగుతున్న ప్రాంతం పరిధిలోకి బల్టల్ బేస్ క్యాంపుని సందర్శించి సెక్యూరిటీ అధికారులతో మాట్లాడారు. యాత్రకు వచ్చే భక్తుల రక్షణ బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాల్సిందిగా తెలిపారు.
జూన్ 28వ తేదిన జరిగే ఈ యాత్రకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.