జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కట్టుదిట్టమైన శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉన్న బిఎస్ఎఫ్ క్యాంపుపై పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దాడులకు తెగబడింది. అయితే భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టింది. కానీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో  ఒక ఏఎస్ఐ మృతి చెందగా, మరో ముగ్గురు  జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.  


ఈ విషయమై జమ్మూకాశ్మీర్ డీజీపీ ఎస్పి వైద్ మాట్లాడుతూ .. "బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ హెడ్క్వాటర్స్ లో ఉదయం ముగ్గురు తీవ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో లోనికి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. కానీ ఈ కాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బీకే యాదవ్ (50) చనిపోగా, ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి" అని చెప్పారు. ఉగ్రవాదులు బాంబులు పెట్టి ఉండవచ్చనే కోణంలో గాలింపులు ముమ్మరం చేశామని చెప్పారు. దాడులు జరగడంతో శ్రీనగర్ లో పౌర సేవలకు విఘాతం  కలిగింది.   శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోగా, ఉదయం పది గంటల తర్వాత పునరుద్ధరించారు. ఉగ్రదాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలను కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.