జమ్మూలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి; జవాను మృతి; ఇద్దరికి గాయాలు
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం తెల్లవారు ఝామున 4:55 గంటల ప్రాంతంలో సన్‌జౌన్ ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుఝామున 4:55 గంటల ప్రాంతంలో సన్‌జౌన్ ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా.. ఒక హవాల్దార్, అతని కుమార్తెకు గాయాలయ్యాయి. ఉగ్రదాడితో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యారు. ఆర్మీ క్యాంప్‌పై దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఉగ్రవాదులు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) గ్రూపుకు చెందినవారిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు మరణించి ఐదేళ్ళు కావొస్తున్న దృష్ట్యా, ఇంటెలిజెన్స్ వర్గాలు సైన్యంపై దాడి జరగవచ్చని ముందే హెచ్చరించింది.
"తెల్లవారుఝామున 4:55 గంటల ప్రాంతంలో తీవ్రవాదుల కదలికను గమనించాము. తీవ్రవాదలు ఎంత మంది ఉన్నారో తెలియదు. ముష్కరులు ఒక కుటుంబంపై దాడి చేసి హవాల్దార్, అతని కుమార్తెను గాయపరిచారు. ఆపరేషన్ ఇంకా జరుగుతోంది' అని జమ్ము ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్డి సింగ్ జామ్వాల్ ఏఎన్ఐకి తెలిపారు.