శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో పుల్వామా తరహాలో మరో ఉగ్రదాడికి ఉగ్రవాదులు వ్యూహం రచిస్తున్నట్టుగా విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందినట్టు నిఘావర్గాలు తెలిపాయి. ఆదివారమే ఈ దాడి జరిగే అవకాశాలున్నట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈసారి చేయబోయే దాడికి మోటార్ బైక్ లేదా మోటార్ బైక్‌కి ఉపయోగించే రిమోట్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మిలిటరీ గ్రేడ్ ఐఇడి బాంబులను పేల్చి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం పన్నుతున్నట్టు తెలిసిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. హైవేలపై ప్రయాణించే భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. హైవేలపై భద్రతా బలగాలు ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిఘావర్గాలు సూచించాయి. అంతేకాకుండా ఉదయం 9 గంటల తర్వాతే భద్రతా బలగాల తరలింపు చేపట్టాల్సిందిగా తమ సూచనల్లో పేర్కొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. భద్రతా బలగాల మోహరింపు, తరలింపు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 


ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడిలో 40 మంది జవాన్లను బలితీసుకున్న సంగతి తెలిసిందే.