దావూద్ ఇబ్రహీం జట్టు సభ్యుడి భార్య అరెస్టు: మారణాయుధాలు స్వాధీనం
కరడు గట్టిన నేరస్తుడు, మాఫియా రంగంలో ప్రముఖుడు దావూద్ ఇబ్రహీంకు నమ్మకస్తుడైన వ్యక్తి నయీమ్ ఖాన్. ఈ రోజు ఆయన భార్య ఇంట్లో సోదాలు నిర్వహించిన థానే పోలీసులు.. అక్కడ పలు మారణాయుధాలతో పాటు ఏకే 56 రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కరడు గట్టిన నేరస్తుడు, మాఫియా రంగంలో ప్రముఖుడు దావూద్ ఇబ్రహీంకు నమ్మకస్తుడైన వ్యక్తి నయీమ్ ఖాన్. ఈ రోజు ఆయన భార్య ఇంట్లో సోదాలు నిర్వహించిన థానే పోలీసులు.. అక్కడ పలు మారణాయుధాలతో పాటు ఏకే 56 రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ రైఫిల్‌తో పాటు 3 మ్యాగజైన్లు, 108 లైవ్ రౌండ్స్, రెండు 9 ఎంఎం పిస్టల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్ ఖాన్ భార్య యాస్మీన్ ప్రస్తుతం ముంబయిలో గోరెగావ్ ప్రాంతంలో నివాసముంటున్నారు.
ఇటీవలే థానే పోలీసులు ఇద్దరు డ్రగ్ సరఫరాదారులను అరెస్టు చేశారు. వారి ద్వారానే నయీమ్ భార్య ఇంట్లో మారణాయుధాలు ఉన్న విషయం పోలీసులకు తెలిసింది. ఈ క్రమంలో నయీమ్‌కు చెందిన మూడు ఇళ్ళల్లో కూడా సోదాలు నిర్వహించాలని భావించారు. బంగూర్ నగరుతో పాటు గోరెగావ్, ముంబయి ప్రాంతాల్లో ఉన్న నయీమ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా.. ఆఖరికి గోరెగావ్ ఇంట్లో పోలీసులకు ఆయుధాలు లభించాయి.
ఏప్రిల్ 2016న నయీమ్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నయీమ్, చోటా షకీల్ గ్యాంగ్ తరఫున ఇక్బాల్ అత్తర్వాలా అనే మరో గ్యాంగస్టర్‌ని హతమార్చాడు. ప్రస్తుతం నయీమ్ భార్య యాస్మీన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆమెను ఆదివారం కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. ఆమె ఇంట్లోకి ఆయుధాలు ఎలా వచ్చాయన్న విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.