కోట: పబ్‌జి లాంటి గేమింగ్ యాప్స్, టిక్‌టాక్ లాంటి వీడియో యాప్స్ పలువురు ప్రాణాలు కోల్పోవడానికి హేతువు అవుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల భర్త తనను టిక్‌టాక్‌ వీడియోలు చేయనివ్వడం లేదనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి ఇంకా మర్చిపోకముందే తాజాగా ఓ 12 ఏళ్ల బాలుడు టిక్‌టాక్‌ వీడియో చేస్తూ ప్రాణాలు కోల్పోయిన తీరు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. టిక్‌టాక్‌ వీడియో ఛాలెంజ్‌లో పాల్గొనాలనే సరదా ఓ 12 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన రాజస్థాన్‌లోని కోటలో శుక్రవారం చోటుచేసుకుంది. తన తల్లి గాజులు, మంగళసూత్రం, సింధూరం ధరించి బాత్ రూమ్‌లో భిన్నమైన వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయాలని భావించిన ఓ బాలుడు ఆ ప్రయత్నంతోనే తుదిశ్వాస విడిచాడు. 


బాత్ రూమ్‌లోకి వెళ్లిన తమ కుమారుడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కంగారుతో గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన తల్లిదండ్రులకు విగత జీవిగా పడి ఉన్న తమ కుమారుడు కనిపించాడు. బాలుడిని తీసుకుని హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లినప్పటికీ.. అప్పటికే బాలుడు కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లో భాగంగా బాత్‌ రూమ్‌లో పెద్ద గొలుసును మెడకు చుట్టుకుని వీడియో కోసం ప్రయత్నించిన తమ కుమారుడు.. అనుకోకుండా అదే గొలుసు మెడకు బిగుసుకుపోయి శ్వాస అందక ప్రాణాలు కోల్పోయాడని, లేదంటే ఇలా జరిగి ఉండేదే కాదని బాలుడి తల్లిదండ్రులు బోరుమంటున్నారు.