జీఎస్టీ చట్టం: నేటి నుంచి అమల్లోకి టీడీఎస్, టీసీఎస్
జీఎస్టీలో టీడీఎస్, టీసీఎస్.. నేటి నుంచి అమల్లోకి
అక్టోబర్ 1, 2018 నుంచి రూ.2.50 లక్షలు పైబడిన వస్తు, సేవలపై జీఎస్టీలో 1 శాతం టీడీఎస్ చెల్లించాలన్న నిబంధన అమల్లోకి రానుంది. జీఎస్‌టీ చట్టంలో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్)కు సంబంధించిన నిబంధనలను అక్టోబరు 1 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం గతంలోనే నోటిఫై చేసింది.
సీజీఎస్టీ చట్టం ప్రకారం.. వస్తు సేవల సరఫరాపై చెల్లింపుల విలువ రూ.2.50 లక్షలకు మించితే నోటిఫైడ్ సంస్థలు 1 శాతం టీడీఎస్‌ను వసూలు చేస్తారు. ఎస్‌జీఎస్టీ చట్టాల కింద రాష్ట్రాలు కూడా 1 శాతం టీడీఎస్‌ను విధిస్తాయి. అలాగే ఇ-కామర్స్ కంపెనీలు పేమెంట్లపై 1 శాతం టీసీఎస్‌ను వసూలు చేస్తారు. రాష్ట్రాలు కూడా ఎస్‌జీఎస్టీ చట్టం కింద 1 శాతం టీసీఎస్‌ను విధించవచ్చు.
గతనెలతో పోలిస్తే.. ఈ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం.. ఆగస్టు నెలలో నెలలో జీఎస్టీ కింద 93,960 కోట్ల వసూళ్లు కాగా, సెప్టెంబర్ నెలలో స్వల్పంగా పెరిగి రూ. 94,442 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ (CGST) 15,318 కోట్ల రూపాయలు, స్టేట్ జీఎస్టీ (SGST) 21,061 కోట్ల రూపాయలని తెలిసింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రూ.50,070 కోట్లు, సెస్ నుంచి రూ.7,993కోట్లు వసూళ్లు నమోదైనట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది.
అయితే, ఈ సమాచారం ఎవరు, ఎక్కడ, ఎప్పుడు వెల్లడించారనే వివరాలను మాత్రం సదరు న్యూస్ ఏజెన్సీ స్పష్టంచేయలేదు.
మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూలు లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అరుణ్‌జైట్లీ సూచించారు. ఇటీవలే 30వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ… కేరళ వరద నష్టాన్ని పూడ్చుకోవడానికి కొన్ని వస్తువులపై జీఎస్టీ పెంచాలన్న ప్రతిపాదనకు అనుమతించామని తెలిపారు. జీఎస్టీ ప్రారంభించిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వసూళ్లు బాగా తగ్గిందన్నారు. మిజోరం, అరుణాచల్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మిగులు ఎదుర్కొంటున్నాయని.. కొన్ని రాష్ట్రాలు రెవెన్యూ కొరతలో ఉన్నాయని తెలిపారు. 2017-18కి గాను కేంద్రం రూ.41,147 కోట్ల జీఎస్టీని రాష్ట్రాలకు విడుదల చేసిందని తెలిపారు.