ఆధార్‌తో వ్యక్తిగత వివరాలు భద్రం అని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆధార్‌తో పర్సనల్ డేటా లీక్ అయ్యే అవకాశం లేదని కూడా చెప్పింది. అయితే  దీనిని నిరూపించడానికి స్వయానా భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ రంగంలోకి దిగారు. ట్రాయ్ చైర్మన్ తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే తన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయండంటూ ట్విట్టర్‌లో సవాల్ విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్‌ వివరాలు భద్రమని మీరు భావిస్తే.. మీ ఆధార్‌ కార్డు వివరాలు బహిర్గతం చేయండంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు ఈ మేరకు బదులిచ్చారు. ఫ్రెంచ్‌ సెక్యూరిటీ పరిశోధకుడొకరు ఆధార్ వివరాలు భద్రం కాదని.. చిరునామా, పుట్టిన తేదీ వివరాలు, ఫోన్ నెంబర్ వివరాలు బహిర్గతం అవుతాయని ఆరోపించారని ఓ నెటిజన్‌ పేర్కొనగా.. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. సమాచార భద్రత, ఆధార్‌ వివరాల భద్రత విషయమై ఆధార్‌ చట్టంలో పలు సవరణలు చేయాలని సూచిస్తూ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిన మర్నాడే శర్మ ఈ ఛాలెంజ్‌ను విసరడం కొసమెరుపు.


అయితే ఆ ఛాలెంజ్‌కు వచ్చిన స్పందన చూసి ట్రాయ్ చైర్మన్ ఖంగుతిన్నారు. శర్మ ట్వీట్ చేసిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్ నెంబర్, ఫోటో, పాన్ నెంబర్ తదితర వివరాలు రాబట్టినట్లు పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. శర్మ వివరాలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై విచారణ జరుపుతామని ట్రాయ్ పేర్కొంది. తాజాగా మోదీ ఆధార్ సంఖ్య చెప్పగలరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో శర్మ యూఐడీఏఐ డైరెక్టర్‌ జనరల్‌‌గా పనిచేశారు.