కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. మంగళవారమే సభలో టేబుల్‌పైకి రావాల్సి వున్న ఈ బిల్లు సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన కారణంగా ఆలస్యమైంది. తక్షణ త్రిపుల్ తలాఖ్ విషయంలో ముస్లిం మహిళలకు చట్టపరంగా లబ్ధి చేకూర్చనున్న ఈ బిల్లుని ఎలాగైనా ఆమోదింపచేసుకోవాలని బీజేపీ భావిస్తోంటే, ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకింత అయోమయంలో వుంది. రాజ్యసభలో అధిక మెజార్టీ కలిగి వున్న ప్రతిపక్షం బిల్లుని అడ్డుకుంటే ముస్లిం మహిళా వర్గాల్లో పార్టీపై ఎక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అలా కాకుండా వెంటనే బిల్లుకు ఓకే చెబితే, బిల్లుని అడ్డుకునేందుకు ప్రతిపక్షం ఏ ప్రయత్నం చేయలేదనే అపవాదుతోపాటు బిల్లుని పాస్ చేయించుకున్న ఘనత బీజేపీ సొంతమవుతుంది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో వున్న కాంగ్రెస్ పార్టీ... బిల్లుకు పలు సవరణలు సూచించి బిల్లుని ఆలస్యం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిల్లుని ఆమోదించేందుకు అవసరమైన మెజార్టీని ఎట్టిపక్షంలోనూ కోల్పోకూడదు అని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. తమ సభ్యులు అందరూ జనవరి 2, 3 తేదీలలో తప్పనిసరిగా సభకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఇప్పటికే విప్ జారీ చేసింది. గత వారమే లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్లు ఈరోజు పెద్దల సభలో టేబుల్‌పైకి రానుంది. 


ఇదిలావుంటే, ఈరోజు బిల్లు సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన గులాం నబీ ఆజాద్ ఇవాళ ఉదయమే పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు సభలో సభ్యత్వం కలిగి వున్న ఇతర పార్టీల నేతలని సైతం గులాంనబీ ఆజాద్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులో కొన్ని సవరణలకి పట్టుపట్టే అవకాశం వుందని తెలుస్తోంది.