మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి డీఎస్ యత్నాలు
డీఎస్‌పై వేటుకు రంగం సిద్ధం చేసిన టీఆర్ఎస్..!
ఢిల్లీలో గత మూడు రోజులుగా మకాం వేసి పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్న టీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. డీఎస్ వ్యవహారంపై నిజామాబాద్ ఎంపీ కవిత క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించారు. ఢిల్లీలో డీఎస్ కదలికలపై వారు అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీంతో డి.శ్రీనివాస్‌పై వేటుకు టీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుందని సమాచారం.
డీఎస్‌కు గ్రూపులు కట్టే అలవాటు ఉందని, స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెర తీశారని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. డీఎస్ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే డీఎస్ వ్యవహారంపై జిల్లా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం డిఎస్ వ్యవహారంపై కేసీఆర్ కూడా సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.
డీఎస్ వ్యవహారంపై ఓపిక పట్టాం
డీఎస్ వ్యవహారంపై చాలా రోజులుగా ఓపిక పట్టామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. డీఎస్ వ్యవహారంపై క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. కార్యకర్తలను ఇతర పార్టీల్లోకి వెళ్లాలని డీఎస్ సూచిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. తప్పు ఎవర చేసినా సీఎం ఉపేక్షించరని.. రేపు తాను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
అనుచరులతో సమావేశమైన డీఎస్
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. సమావేశంలో డీఎస్ తనయుడు సంజయ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంపీ కవిత వ్యాఖ్యలపై డి.శ్రీనివాస్ అనుచరులతో చర్చించారు.