కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ని హత్య చేసేందుకు ప్లాన్ చేయాలని వాట్సాప్ సందేశాలు పంపించుకున్న ఇద్దరు తాగుబోతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో సరదాగా ఛాట్ చేసుకున్న సందేశాలు బయటి గ్రూపులకి కూడా అనుకోకుండా చేరడంతో.. ఎవరో వాటి స్క్రీన్ షాట్లను పోలీసులకు పంపించి ఎలర్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని దర్చులా ప్రాంతాన్ని నిర్మలా సీతారామన్ సందర్శిస్తున్న సందర్భాన్ని టాపిక్‌గా తీసుకొని తాగుబోతులిద్దరూ ఛాట్ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఐటి యాక్ట్ సెక్షన్ 66 క్రింద కూడా కేసులు నమోదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్ ఛాట్ చేసిన వ్యక్తిలో ఒకరు "నేను నిర్మలా సీతారామన్‌ని కాల్చి చంపాలని అనుకుంటున్నాను" అన్నాడు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాట్లాడుతూ వీరిపై గతంలో ఏవైనా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయా? లేదా? అన్న కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. మంత్రి నిర్మలా సీతారామన్ దర్చులా ప్రాంతాన్ని సందర్శించి ఆర్మీ మెడికల్ క్యాంపుని ప్రారంభిస్తున్న క్రమంలో ఈ ఛాట్ మెసేజ్‌ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 


గతంలో కూడా భీమా కోరెగావ్ అల్లర్ల ఘటన జరిగినప్పుడు మావోయిస్టులు ఇలాగే సందేశాలు పంపించుకున్నారని.. ఆ సందేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారని పోలీసులు అంటున్నారు. వాట్సాప్ వంటి యాప్స్ ఉపయోగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. దేశ వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టినా.. అలాంటివారిని ఉపేక్షించేది లేదని.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటిని నియంత్రించడానికి తమ నిఘా వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తుందని వారు తెలిపారు.