ఎగ్జిట్ పోల్ ఫలితాలను తిరస్కరించిన శివసేన
ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన పార్టీ ఎగ్జిట్ ఫలితాలపై భిన్నంగా స్పందించింది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎన్డీయే మిత్రపక్ష పార్టీ శివసేన భిన్నంగా స్పందించింది. ఈ ఫలితాలను తాము తిరస్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. ఈ ఫలితాలు చూసి ఎవరూ సంబరపడాల్సిన అవసరం లేదని.. డిసెంబర్ 18న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఓపిక పట్టాలని బీజేపీకి ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలన్నీ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. 182 స్థానాలకుగాను 100 సీట్లకు పైగా బీజేపీ సాధిస్తుందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఉద్దేవ్ థాక్రే స్పందించారు.
రాహుల్‌కు థాక్రే కితాబు
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీకి శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ బాగా కష్టపడ్డారని అభినందించారు. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న శివసేన పార్టీ..మోడీ వైఖరి నచ్చక బీజేపీతో దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా థాక్రే వ్యాఖ్యలు బీజేపీకి దూరంగా ఉండమే కాదు..కాంగ్రెస్‌కు దగ్గరైనట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.