కాశ్మీర్ సమస్యలపై.. మోడీ సర్కార్ కీలక నిర్ణయం
కాశ్మీర్ పట్ల భారత ప్రభుత్వ వైఖరి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తినప్పుడల్లా ఏదో ఒక సందేహం కలగక మానదు. ఒకవైపు ఉగ్రవాదంపై పోరాటం.. మరోవైపు అక్కడి ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న అసహనం ఒక కారణమైతే.. ఈ మధ్యకాలంలో పర్యావరణ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో కాశ్మీర్‌లోని సమస్యలను ఒక కొలిక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు.
కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిథిగా సీనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి దినేశ్వర్ శర్మను నియమిస్తున్నట్లు తెలిపారు. కాశ్మీరీలతో మేము మమేకమవడం వలనే వారి సమస్యలేమిటో మాకు పూర్తి తెలుస్తాయి అని గతంలో ప్రధాని మోడీ అన్న మాటలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ప్రస్తుతం కాశ్మీరులో వేర్పాటువాదుల వల్ల ఎప్పటికప్పుడు చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు ముగింపు పలికేందుకు ఈ కొత్త మార్గాన్ని అనుసరిస్తు్న్నట్లు, ఆ ప్రాంతంలో శాంతిని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
భారత ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో తీసుకున్న కీలక నిర్ణయంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉందని, అయితే తాను ఫలితాలను బట్టి మాట్లాడతానని చెప్పారు.
2010లో కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓ కమిటీ కాశ్మీర్ సమస్యలను తెలుసుకొని, ఒక సమగ్ర రిపోర్టును ప్రభుత్వానికి అందివ్వడానికి ప్రయత్నించింది. అయితే దాని వలన ఆ తర్వాత ఎలాంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోలేదు.
ప్రస్తుతం భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపికైన దినేష్ శర్మ 1976 కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి. కేరళలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసరు ర్యాంకు నుండి కేరళ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరీ ఎస్‌ఎస్పీ వరకూ ఎదిగారు. ఆ తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డిఐజీగా కూడా నియమితులయ్యారు.
ఆ తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కలిసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్‌గా పనిచేశారు.