కారు ఆపలేదన్న కారణంతో యాపిల్ సంస్థ ఉద్యోగిపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఉద్యోగి శనివారం మృతి చెందాడు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. యాపిల్ కంపెనీ ఉద్యోగి (అసిస్టెంట్ సేల్స్ మేనేజర్) అయిన వివేక్ తివారీ (38) విధులు ముగించుకొని వస్తుండగా.. రాత్రి 2:30 గంటల సమయంలో గోమతి నగర్ ప్రాంతంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.. అనుమానాస్పదంగా కనిపించడంతో కారును ఆపాలంటూ అడ్డుకున్నారు. అయినప్పటికీ తివారీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ సమయంలో పోలీసులకు బైక్‌ని ఢీకొట్టి తర్వాత కారు రోడ్డు పక్కన గోడను ఢీకొట్టింది. ఆ సమయంలో అతడ్ని నేరస్తుడిగా భావించిన ఓ కానిస్టేబుల్ అతడిపై కాల్పులు జరిపాడు. అనంతరం ఆయన్ను లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాల కోల్పోయారు. ఆ సమయంలో కారులో తివారీతో పాటు ఆయన మాజీ సహోద్యోగి కూడా ఉన్నట్లు తెలిసింది.


'ఐపీసీ 302 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశాం. తీవ్ర గాయాల వల్ల మరణించాడా? లేక బుల్లెట్ గాయాల వల్ల మరణించాడా? అన్నది పోస్టు మార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుంది' అని సీనియర్ ఎస్పీ కళానిధి నితానీ ఏఎన్ఓ వార్తా సంస్థకు తెలిపారు. కానిస్టేబుళ్లని విచారిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. లక్నో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.


ఎస్పీ (క్రైమ్) ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైందని.. దీనిపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ కు వ్యక్తిగతంగా అభ్యర్థన పంపినట్లు సీనియర్ ఎస్పీ కళానిధి నితానీ  తెలిపారు.


కాగా తివారీ భార్య కల్పనా మాట్లాడుతూ... ‘‘కారు ఆపకపోవడం నేరమా? ఇదెక్కడి శాంతి భద్రతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాధానం చెప్పాలి...’’ అంటూ కంటతడి పెట్టారు. వివేక్ తివారీ కుటుంబం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది.


ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.


ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని.. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.


ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ.. ఇది ఎన్కౌంటర్ కాదని, అవసరమైతే సీబీఐ విచారణకు కూడా ఆదేశిస్తామని శనివారం లక్నోలో తెలిపారు.