Constable Exam: నిరుద్యోగులకు అలర్ట్.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్ష రద్దు
Police Constable Recruitment Exam Cancelled: నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు ఆట ఆడుకుంటున్నాయి. ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. తాజాగా ఇదే కారణంతో ఓ ఉద్యోగ ప్రకటన పరీక్ష రద్దయ్యింది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
Police Constable Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్ష ప్రశ్నాపత్రాలు తరచూ లీకవుతున్నాయి. గతంలో పలు ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకవగా తాజాగా కానిస్టేబుల్ నియామక పరీక్ష పేపర్లు కూడా బయటకు వచ్చాయి. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ఇప్పుడు ఆ పరీక్షను రద్దు చేశారు. పోటీ పరీక్ష రద్దుతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Modi: నీ మొగుడితో గొడవ జరిగితే మాత్రం మోదీ పేరు చెప్పొద్దు.. మహిళలతో ప్రధాని జోకులు
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ చేపట్టారు. 60,244 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అందులో భాగంగా ఈనెల 17, 18వ తేదీల్లో పోటీ పరీక్షలు నిర్వహించారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. అయితే ఆ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది. నిరుద్యోగులు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు మొదలుకావడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు.
Also Read: PayTm: పేటీఎమ్‌కు భారీ ఊరట.. ఆర్బీఐ ప్రకటనతో యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చా లేదా?
'రిజర్వ్ సివిల్ పోలీస్ పోస్టుల ఎంపిక కోసం నిర్వహించే పరీక్ష-2023ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. వచ్చే 6 నెలల్లోపు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం. పరీక్షల పవిత్రత విషయంలో రాజీ పడకూడదు. యువత శ్రమతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. పేపర్ లీక్‌లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం' అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
యూపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా చేయడం లేదు. ఏ ఉద్యోగ ప్రకటన విడుదల చేసినా ఏదో ఒక వివాదం నడుస్తోంది. దీనివలన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. తరచూ ప్రశ్నాపత్రాల లీక్‌తో ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని పరీక్షలకు ఇలాగే లీక్‌లు అయినా కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. కాగా ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం ప్రభుత్వం ముందే స్పందించింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ పరీక్షలను రద్దు చేసిందని చర్చ జరుగుతోంది.
లీక్ ప్రదేశ్
కాగా ఈ పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ పాలనలో ఇప్పటివరకు పేపర్ లీక్‌లు జరిగిన జాబితాను విడుదల చేసింది. 'జూలై 2017, సెప్టెంబర్ 2018, నవంబర్ 2021, ఫిబ్రవరి 2023, ఫిబ్రవరి 2024లో వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి' అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌ను లీక్ ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులతో యోగి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి