రుతుపవనాలు తీసుకొచ్చిన భారీ వర్షాలు దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలకు కారణమైతే, ఇంకొన్ని చోట్ల ఎండా కాలం మిగిల్చిన వేసవి తాపం నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం ఇస్తున్నాయి. అయితే, ఇదే వర్షాలు కొన్ని లేనిపోని వ్యాధులను కూడా మోసుకొచ్చే ప్రమాదం ఉండటంతో గుజరాత్‌లోని వదోదర మునిసిపాలిటీ ఆ నగరంలో పానీ పూరి అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల ప్రభావం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదని భావిస్తూ వదోదర మునిసిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వదోదరలో వాంతులు, విరోచనాలతో చాలామంది ఆస్పత్రులపాలయ్యారు. ఇటువంటి వ్యాధులకు వీధుల్లో విక్రయించే నాణ్యత లేని చిరుతిండే కారణం అని భావించిన మునిసిపాలిటీ విభాగం అధికారులు.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వదోదరలో పానీ పూరి అమ్మకాలపై నిషేధం విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ఇదిలావుంటే, వదోదర మునిసిపాలిటీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యం బారిన పడకుండా అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అభినందిస్తుంటే, పానీ పూరి ప్రియులు మాత్రం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.