బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్యకాలంలో వినూత్న శైలిలో జనాల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. పురాణ పాత్రల సహాయంతో ఈ అవగాహన శిబిరాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు యమధర్మరాజు గెటప్‌లో పోలీసులు వాహన చోదకులను ఆపి "హెల్మెట్ ధరించకపోతే వచ్చేది మా దగ్గరకే" అని సందేశమిస్తూ.. వారిలో అవగాహన పెంచడానికి ప్రయత్నించారు. అయితే ఈసారి మళ్లీ కొత్త ట్రెండ్ తీసుకురావాలని భావించిన పోలీసులు వినాయకుడి గెటప్ వేసుకొని హెల్మెట్ ధరించని వాహన చోదకులను ఆపి వారికి హెల్మెట్‌తో పాటు గులాబీ పువ్వులు కూడా ఇవ్వడం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెల్మెట్ ధరిస్తే.. అనుకోని రోడ్డు ప్రమాదాల బారిన పడినా తలకు ఎలాంటి గాయాలు తగలవని హితవు చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా, ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జానపద కళాకారుల సహాయం కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని బెంగళూరు పోలీసులు అంటున్నారు. 


యమధర్మరాజు గెటప్‌లో రోడ్డు మీదికి వచ్చి ట్రాఫిక్ రూల్స్ ప్రచారం చేయాలనే ఆలోచన తొలుత పోలీసులకు వీరేష్ ముత్తినమత్ అనే థియేటర్ ఆర్టిస్టును చూసి కలిగింది. గతంలో ఈ కళాకారుడు అదే వేషంలో వెళ్లి ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేవాడు. ఇటీవలే ఆయనను కర్ణాటక ప్రభుత్వం సన్మానించింది. అలాగే ఆయనకు రూ.10,000లను బహుమతిగా కూడా పోలీసు శాఖ ప్రకటించింది. ఈ మధ్యకాలంలో బెంగళూరు పోలీసులు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కి సంబంధించిన సిగ్నేచర్ పోజ్‌ను ప్రచారానికి ఉపయోగించుకున్నారు. "దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే" సినిమాలో షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఆ పోజ్ ఇప్పుడు బెంగళూరు పోలీసులకు ఆ విధంగా కలిసొచ్చింది.