హైదరాబాద్ : విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆయనకు తీవ్ర సమస్య‌లున్నాయని, దానితో పాటు కరోనావైరస్ ( Coronavirus ) వేగంగా  వ్యాపిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోందని, కాబట్టి ఆయనను తక్షణం విడుదల చేయాలని కోరుతూ వరవరరావు ముగ్గురు కూతుర్లు సహజ, అనల, పావనలు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కొశ్యారి ( Maharashtra governor, Bhagat Singh Koshyari ), హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి ( Bombay high court chief justice Dipankar Dutta ), ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేలకు (Maharashtra CM Uddhav Thackeray )  లేఖ రాశారు. ( Read also : భీమ కొరేగావ్‌ హింసాకాండ: విరసం నేత వరవరరావు అరెస్టు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ లేఖ పూర్తి సారాంశం ఇలా ఉంది.


సర్,


మా తండ్రి, ప్రముఖ విప్లవ కవి వరవరరావుపై తప్పుడు అభియోగాలతో మోపిన ఒక కేసులో మహారాష్ట్ర జైళ్ళలో (2020 ఫిబ్రవరి వరకు పూణేలోని ఎరవాడ జైలులోనూ, దరిమిలా నవీ ముంబైలోని తలోజా జైలులోనూ) ఖైదీగా ఉన్నారు. కొవిడ్ -19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త (ముంబై హైకోర్టులో సోమవారంనాడు ఒక ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది) మమ్ములను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మా నాన్నగారి వయస్సు 80 సంవత్సరాలు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం దుర్బలంగా ఉన్నందున ఆయనకు కరోనా వైరస్ సోకే ప్రమాదమున్నది. ఎనిమిది వారాల క్రితం లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరువాత నుంచి జైలులో ఉన్న మా తండ్రిని సందర్శించేందుకు మాకు అనుమతి లభించలేదు. సాధారణ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి కూడా అనుమతినివ్వలేదు. ఆయన్ని సందర్శించేందుకు న్యాయవాదులను సైతం అనుమతించడం లేదు. ఈ ఎనిమిదివారాలుగా మా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు మేము ఎంతో వ్యాకులతతో ఆతురపడుతున్నాము.


డెబ్బై సంవత్సరాలకు పైబడిన వయస్సులో వుండి, అనారోగ్యంతో బాధపడుతున్న మా తల్లితో మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు మా నాన్న గారిని అనుమతించారు. ఆయన మా అమ్మతో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించారు. మా నాన్నగారు ఇప్పుడు విచారణలో ఉన్న ఖైదీ మాత్రమే. గత 47 సంవత్సరాలలో మా తండ్రిపై మోపిన 25 కేసులలోనూ ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 21 విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు కల్పించింది. రాజ్యాంగం ప్రకారం ఆయనకు గల ఈ హక్కుకు ఇప్పుడు ప్రమాదం వాటిల్ల కూడదు. 


తలోజా జైలులో ఖైదీ మరణం గురించి, కొవిడ్-19 వ్యాప్తి గురించి వార్తా పత్రికల్లో చదివాము. తలోజా జైలులో అధికారులను కలిసి మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయాలని మా న్యాయవాది పద్మను అడిగాము. ఆమె ఈ విషయమై తలోజా జైలు అధికారులకు ఫోన్ చేయగా, ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకున్నారుగానీ, న్యాయవాది ప్రశ్నలకు ప్రతిస్పందించలేదు. మా తండ్రి శ్రేయస్సు గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఆతురపడుతున్నాము. ఆందోళన, వ్యాకులత, నిస్సహాయత్వం కలగలిసిన ఈ తీవ్ర దుర్బర పరిస్థితులలో మా నాన్నగారి నిర్బంధ వ్యవహారాన్ని పరిశీలించి, ఈ క్రింద పేర్కొన్న వాటిపై తగుచర్యలకు చొరవ తీసుకోవాలని మిమ్ములను అభ్యర్థిస్తున్నాము. 


(1) వయస్సు, ఆరోగ్యం, కొవిడ్- 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వరవరరావును తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలి.


(2) వరవర రావు భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్వయంగా నిర్ధారించుకుని, భరోసా పొందేందుకై ఆయన్ని జైలులో సందర్శించేందుకు కుటుంబ సభ్యులకు అనుమతినివ్వాలి.


(3) కుటుంబ సభ్యులకు తరచు ఫోన్ చేసేందుకు, ఉత్తరాలు రాసేందుకు ఆయనకు అనుమతినివ్వాలి. 


(4) జైలులో మా నాన్నగారితో సమావేశమయ్యేందుకు న్యాయవాదులను అనుమతించాలి. 


ధన్యవాదాలు.
పి. సహజ, పి. అనల, పి. పావన


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..