సీజేఐపై అభిశంసన తీర్మానం; తిరస్కరించిన ఉపరాష్ట్రపతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న వెంకయ్యనాయుడు నోటీసును తిరస్కరించారు. సీజేఐపై అభియోగాలు పేర్కొంటూ కాంగ్రెస్ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం విదితమే.న్యాయ నిపుణుల సలహా మేరకే వెంకయ్య నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ లా ఆఫీసర్ కే పరసరన్ లతో ఉపరాష్ట్రపతి సమావేశం అయ్యారు. గతంలో మాదిరిగా కమిటీ వేయాల్సిన పనిలేదని నిపుణులు అన్నారని సమాచారం. ఆదివారం హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకుని, వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశం రాత్రి బాగా పొద్దుపోయేవరకు జరగడం విశేషం.
కాంగ్రెస్ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు సీజేఐ దీపక్ మిశ్రాను అభిశసించాలంటూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ అభిశంసన నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఇటీవలే రాజ్యసభ నుండి రిటైర్ అయిన ఏడుగురు సభ్యులు సంతకాలు చేశారు.
కాగా అభిశంసన తీర్మానం నోటీసు తిరస్కరణకు గురైన విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత పీఎల్ పునియా, తిరస్కరణకు కారణాలు తెలియరాలేదని, కాంగ్రెస్, ఇతర పార్టీలు దీనిపై చర్చించి, న్యాయ నిపుణులతో మాట్లాడి ఆ దిశగా తదుపరి అడుగులు వేస్తామని అన్నారు.