పార్లమెంట్‌లో వర్షాకాలం సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజ్య సభలో రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు 10 ప్రాంతీయ భాషల్లో మాట్లాడి ఆకట్టుకున్నారు. సభ్యులకు తమ తమ భాషల్లో మాట్లాడే అవకాశం ఉందని ప్రకటించే క్రమంలో హిందీతోపాటు తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, బంగ్లా, గుజరాతి, పంజాబి, మరాఠి, నేపాలి, ఒరియ భాషల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన సూచన ఈ సమావేశాల తొలిరోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం ప్రారంభమైన వర్షా కాల సమావేశాలు ఆగస్టు 10న ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో పార్లమెంట్ మొత్తం 18 రోజులపాటు సమావేశం కానుంది. ఓవైపు ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవాలని కేంద్రం భావిస్తుండగా, మరోవైపు పలు పార్టీల మద్దతుతో ప్రతిపక్షం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 


ఇదిలావుంటే, మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో రెండు ఆర్థికపరమైన వ్యవహారాలతోపాటు 46 బిల్లులను పాస్ చేయించుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది.