విదేశాలకు పారిపోయే ముందు విజయ్ మాల్యా బీజేపీ నాయకులను కలిశాడు: రాహుల్ గాంధీ
లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్నప్పుడు బీజేపీ నాయకులతో కలసి మాట్లాడారని ఆయన ఆరోపణలు చేశారు. అదే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపి పెట్టి పలయానం చిత్తగించిన నీరవ్ మోదీకి, భారత ప్రధానికి మధ్య కూడా సంబంధాలు ఉన్నాయని.. అందుకే ప్రభుత్వం ఈ మోసగాళ్ళ విషయంలో స్పందించడం లేదని అభిప్రాయపడ్డారు.
అలాగే ఇటీవలి కాలంలో విజయ్ మాల్యాను భారత్ పంపించాలంటే.. అక్కడి జైళ్ళ పరిస్థితిని తెలియజేసే వీడియోలు పంపించాలని సిబిఐకి లండన్ కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా రాహల్ స్పందించారు. "భారతదేశంలో జైళ్లు చాలా కఠినమైన ప్రదేశాలు. అది అందరికీ తెలిసిన విషయమే. న్యాయమనేది భారతీయులందరికీ ఒకేలా ఉండాలి. 9000 కోట్లను బ్యాంకులకు బకాయిలు చెల్లించకుండా పారిపోయిన విజయ్ మాల్యాని వేరే జైలులో పెట్టాలని కోరడం అంగీకరించకూడని విషయం" అని రాహుల్ తెలిపారు.
తాజాగా సిబిఐ అధికారులు లండన్ కోర్టుతో మాట్లాడుతూ.. తాము మాల్యా ఉండే గదిలో టెలివిజన్, పర్సనల్ టాయిలెట్, మంచం అన్నీ సమకూరుస్తామని తెలిపారు. అలాగే మాల్యా ఉండబోయే ప్రదేశాన్ని వీడియో తీయించి కోర్టు వారికి సమర్పించారు కూడా. ప్రస్తుతం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలపై భారత్‌లో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.