ఉత్తరప్రదేశ్‌లో మరో విషాద ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున విశ్వహిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్‌పై కొంత మంది గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.  ఆయన్ను వెంటనే స్థానికులు దగ్గరలో ఉన్న ట్రామా సెంటర్‌కు తీసుకు వెళ్లారు. కానీ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. రంజిత్ బచ్చన్ తోపాటు ఆయన సోదరునిపైనా దుండగులు కాల్పులు జరిపారు.  ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆరు బృందాల గాలింపు 
రంజిత్ బచ్చన్‌పై కాల్పులు జరిపిన అనంతరం దుండగులు పారిపోయారు. లక్నోలోని గ్లోబ్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హిందుత్వ సంస్థకు చెందిన కీలక వ్యక్తులపై కాల్పులు జరపడం ఉత్తరప్రదేశ్‌లో ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో హిందూ సమాజ్ పార్టీ నాయకుడు కమలేష్ తివారీని ఆయన ఇంటి వద్దే దుండగులు హత్య చేసి పారిపోయారు.  ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రంజిత్ బచ్చన్ హత్య కేసు జరిగింది. ఈ ఘటన యూపీలో పరిస్థితులను ఉద్రిక్తంగా మారుస్తోంది.