రూ. 899కే విమానం టికెట్ అందిస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్
విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది.
న్యూఢిల్లీ: విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. రూ.899కే ఎకానమి క్లాస్ విమానం టికెట్ అందిస్తున్నట్టు విస్తారా ఎయిర్ లైన్స్ స్పష్టంచేసింది. ఈ ఆఫర్ కింద ప్రీమియం ఎకానమి క్లాస్‌లో ప్రయాణించాలనుకునే వారి కోసం రూ.1,499 టికెట్, అలాగే బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం 4,999లకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, అయితే, ఈ ఆఫర్ కేవలం 24 గంటలు మాత్రమే వర్తిస్తుందని విస్తారా ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఆఫర్ నిబంధనల ప్రకారం నేటి రాత్రి 11:59 గంటల వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఆఫర్ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 18 మధ్య కాలంలో ప్రయాణించే వారు మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకానమి క్లాస్, ప్రీమియం ఎకానమి క్లాస్ టికెట్ కొనుగోలు చేయాలనుకునేవారు కనీసం 15 రోజుల ముందుగా టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండగా బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు కనీసం నెల రోజులు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని విస్తారా వెల్లడించింది.