పశ్చిమ బెంగాల్‌లో మరో బీజేపీ కార్యకర్త మృతి సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం మే 30న పురులియా జిల్లాలో బీజేపీ కార్యకర్త త్రిలోచన్‌ మహతో(20) మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే అదే జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త దులాల్ కుమార్(32) మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. పురులియా జిల్లా బలరాంపూర్‌లోని దభ గ్రామంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పోల్‌కి తాడుతో దులాల్‌ను ప్రత్యర్థులు(టీఎంసీ) ఉరి తీసి హత్య చేసినట్లు బీజేపీ ఆరోపించింది. కాగా దులాల్ కుమార్ మృతిని సీఐడీకి అప్పగిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


రెండు రోజుల క్రితం.. పశ్చిమబెంగాల్‌లోని పురూలియా జిల్లాలో బీజేపీ కార్యకర్త త్రిలోచన్‌ మహతో(20) మృతదేహం పోలీసులకు లభించింది. ఆ మృతదేహం పక్కేనే ఓ హెచ్చరిక నోట్‌ను ఉంచారు. అందులో.. ‘18 ఏళ్ల వయసు నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నందుకే చంపేశాం. నీకు ఓటు హక్కు వచ్చినప్పటినుంచి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కుదిరింది’  అని రాశారు.  కాగా ఇలా తమ యువ కార్యకర్త ఒకరి తరువాత ఒకరు పశ్చిమ బెంగాల్‌లో దారుణ హత్యకు గురికావడం పట్ల బీజేపీ ఆందోళన చెందుతోంది.