ఆ ఇద్దరిలో రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ?
వసుంధరా రాజె తర్వాత రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ?
జైపూర్: రాజస్తాన్‌లో మొత్తం 199 స్థానాలు ఉండగా ప్రస్తుతం అందుబాటులో వున్న ట్రెండ్స్ ప్రకారం 101 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. ఇక ఇప్పటివరకు వసుంధరా రాజే ముఖ్యమంత్రిగా వున్న బీజేపీ పార్టీ 72 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బీఎస్పీ 6 స్థానాలు, ఇతరులు 20 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. రాజస్తాన్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ నేతృత్వంలో పోటీకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకమైన ఫలితాలే కనిపించాయి. ఈ విజయంపై సచిన్ పైలట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ నేతలు, కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యపడిందని అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీకి ఈ విజయం బహుమానం లాంటిది అని సచిన్ పైలట్ పేర్కొన్నారు.
అయితే, కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అశోక్ గెహ్లట్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని, పార్టీ అధినాయకత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామని అశోక్ గెహ్లట్ ప్రకటింటారు.
ఇదిలావుంటే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి పోటీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన అశోక్ గెహ్లట్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్యే ఉందని అక్కడి నేతలు చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతలు మాత్రం వినమ్రంగా అధిష్టానానిదే అంతిమ నిర్ణయం అని ప్రకటించారు. రేపు ఉదయం జైపూర్‌లో జరగనున్న పార్టీ సమావేశంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి ? ఎమ్మెల్యేలు అంతా కలిసి ఏం నిర్ణయం తీసుకోనున్నారో వేచిచూడాల్సిందే మరి.