ఎయిర్ ఏషియా సిబ్బందిపై మహిళ ఫిర్యాదు..!
బెంగుళూరులో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ముగ్గురు ఎయిర్ ఏషియా సిబ్బంది తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని 28 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబరు 3వ తేదీన రాంచీ నుండి బెంగుళూరు వెళ్తున్న ఈ యువతి తొలుత వాష్ రూమ్ అపరిశుభ్రంగా ఉందని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఎయిర్ పోర్టులో దింపేస్తామని బెదిరించారని ఆమె పేర్కొంది. తోటి ప్రయాణికులు తనకు మద్దతుగా నిలిచినప్పటికీ, కెప్టెన్ కూడా తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. "నేను బెంగుళూరు ఎయిర్ పోర్టులో దిగగానే, గ్రౌండ్ స్టాఫ్ కెప్టెన్ కు క్షమాపణ చెప్పమని నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. లేకపోతే పోలీసులకు అప్పగిస్తామని బెదిరించారు. నా చుట్టూ ముగ్గురు స్టాఫ్ ఒక వలయంలా ఏర్పడి నానా దుర్భాషలాడారు. రేప్ చేస్తామని బెదిరించారు" అని ఆమె తెలిపింది. అయితే ఎయిర్ ఏషియా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసింది. ప్రయాణంలో నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లే ప్రయాణికులను కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అవి మాత్రమే ఎయిర్ లైన్స్ తీసుకుందని ఆ ప్రకటనలో తెలిపింది. "ప్రయాణికురాలు మా స్టాఫ్‌తో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడారు. అయినా ఆమెను వారు సున్నితంగానే డీల్ చేశారు. అంతేగానీ.. ఆమె చెప్పినట్లు ఏమీ జరగలేదు" అని ప్రకటనలో పేర్కొంది.