ఉన్నావ్: న్యాయం కోసం తాను పోలీసులను ఆశ్రయించినా.. పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఓ మహిళ సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నేరుగా ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న మహిళ... కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని కార్యాలయం వైపు దూసుకెళ్లారు. అయితే, మధ్యలోనే ఆమెను అడ్డుకున్న పోలీసులు.. మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం తొలుత జిల్లా ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఆమె ఫిర్యాదుపై ఛార్జ్ షీట్ దాఖలు చేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా సదరు మహిళ ఓ వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని.. పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడు ఇప్పుడు మాట మార్చి వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ అక్టోబర్ 2న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు అవదేష్ సింగ్‌పై అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేసి అతడిని కోర్టు ఎదుట హాజరు పరిచామని.. కోర్టు బెయిల్‌పై అతడు బయటికొచ్చాడని పోలీసులు వెల్లడించారు.