బలహీనపడిన రూపాయి: భారత్‌ని హెచ్చరించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
భారత్‌ని హెచ్చరించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
డాలర్ విలువ పెరిగిన కారణంగా బలహీనపడిన రూపాయిని బలపర్చేందుకు బంగారం దిగుమతులపై విధించే సుంకంలో కానీ లేదా ఇతర ఆంక్షలు కానీ విధించరాదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్‌ని హెచ్చరించింది. బంగారం దిగుమతుల విషయంలో కేంద్రం కలగజేసుకోరాదని పేర్కొంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. డాలర్ భారం తగ్గించుకునేందుకు అనవసరమైన దిగుమతులు తగ్గించుకోవాలని భారత్ భావిస్తున్న తరుణంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ ప్రకటన చేసింది.
ఇప్పటికే కిందటేడాదితో పోల్చుకుంటే, ఈసారి బంగారానికి 7 శాతం తక్కువ డిమాండ్ ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియన్ ఆపరేషన్స్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమసుందరం తెలిపారు. అయినా కరెంట్ డెఫిసిట్ విషయంలో బంగారం పాత్ర ఏమంత ముఖ్యమైంది కూడా కాదని సోమసుందరం అభిప్రాయపడ్డారు.